నగరంలో రహదారుల ఆక్రమణలు తీవ్ర సమస్యగా మారుతున్నాయి. రహదారులపై అక్రమ గేట్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కీసర మండలం పరిధిలోని ఓవర్సీస్ బ్యాంక్ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ కాకపోయినా గేట్లు ఏర్పాటు చేసి నాలుగు కాలనీలకు మార్గం మూసివేశారని స్థానికులు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మండలం సురారం గ్రామంలో 30 అడుగుల రహదారిని ఆక్రమించడంతో ప్రధాన రహదారికి అనుసంధానం నిలిచిపోయిందని ఫిర్యాదు చేశారు.నాచారంలో రహదారిని ఆక్రమించి ప్లాట్ విస్తీర్ణం పెంచుకుని నిర్మాణాలు చేపట్టారని, జీడిమెట్లలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే షేక్‌పేట్ మండలంలో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.మొత్తం 43 ఫిర్యాదులు అందగా, వాటిని హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
