హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సుధా రెడ్డి, ప్రతిష్టాత్మక మెట్ గాలా 2026 (Met Gala 2026)లో మూడోసారి పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. “ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్” అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో, ఆమె భారతీయ వారసత్వాన్ని, చేనేత కళను అద్భుతంగా ప్రదర్శించారు. సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమె మెడలో దాదాపు 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 140 కోట్లు) విలువైన అత్యంత అరుదైన నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల వైలెట్-బ్లూ రంగులో ఉన్న టాంజానైట్ రాయి అందరినీ ఆకట్టుకుంది. దీనిని టాంజానియాలోని మెరెలానీ హిల్స్ నుంచి సేకరించారు, అందుకే దీనికి ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేరు పెట్టారు. దీనికి తోడు ఆమె 23 క్యారెట్ల ఎల్లో డైమండ్ రింగ్, 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ రింగ్ కూడా ధరించారు.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన రాయల్ బ్లూ వెల్వెట్ గౌనులో ఆమె మెరిసిపోయారు. ఈ డ్రెస్‌లో కల్పవృక్షం, పాలపిట్ట డిజైన్లు, నెమలి పించం వంటి వాటిని చేర్చారు. గౌను వెనుక భాగంలో ఇత్తడి, రాగి, వెండితో చేసిన తీగలాంటి నిర్మాణంతో పాటు మధ్యలో కల్పవృక్షం డిజైన్‌ను పొందుపరిచారు. ఈ అద్భుతమైన డ్రెస్‌ను తయారు చేయడానికి 90 మందికి పైగా కళాకారులు దాదాపు 3,400 గంటల పాటు శ్రమించారు.
