ఢిల్లీ: India ఇంధన రంగంలో పెట్టుబడులు 2026లో రికార్డు స్థాయికి చేరనున్నాయి. సౌర విద్యుత్, చమురు శుద్ధి రంగాల్లో వేగవంతమైన విస్తరణతో దేశంలోని మొత్తం ఇంధన పెట్టుబడులు 170 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది.
International Energy Agency (ఐఈఏ) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో భారత్లో ఇంధన రంగ పెట్టుబడులు సగటున ఏటా 11 శాతం చొప్పున పెరిగాయి. 2026 నాటికి ఇవి 170 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనున్నాయి.
సౌర విద్యుత్ (సోలార్ పీవీ) రంగంలో పెట్టుబడులు ఈ కాలంలో ఏటా 25 శాతం, చమురు శుద్ధి రంగంలో 23 శాతం చొప్పున పెరిగాయి. ఈ రెండు రంగాలే దేశ ఇంధన పెట్టుబడుల వృద్ధిలో నాలుగో వంతు వాటా కలిగి ఉన్నాయని ఐఈఏ పేర్కొంది.
చమురు శుద్ధి సామర్థ్యం పెంపు
రిఫైనింగ్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులతో 2030 నాటికి భారత్ తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని దాదాపు 15 శాతం పెంచుకునే దిశగా సాగుతోందని నివేదిక తెలిపింది.
అయితే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. మరోవైపు చమురు, సహజవాయువు అన్వేషణ రంగంలో పెట్టుబడులు 2020 నుంచి సగటున ఏటా 7 శాతం తగ్గాయి. దీంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు నివేదిక పేర్కొంది.
బొగ్గు రంగంలోనూ భారీ పెట్టుబడులు
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో బొగ్గు సరఫరా రంగంలో రెండో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని ఐఈఏ వెల్లడించింది. గత దశాబ్దంలో ఈ రంగంలోని పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది.
దేశ ఇంధన అవసరాల్లో బొగ్గు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరాలకు ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది.
2026 నాటికి బొగ్గు సరఫరా రంగంలో పెట్టుబడులు 13 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం సుమారు 1 బిలియన్ టన్నులుగా ఉన్న దేశీయ బొగ్గు ఉత్పత్తిని 2030 నాటికి 1.5 బిలియన్ టన్నులకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది.
స్వచ్ఛ ఇంధన లక్ష్యాల్లో ముందంజ
దేశ మొత్తం ఇంధన వ్యయంలో విద్యుత్ రంగం దాదాపు సగం వాటా కలిగి ఉంది.
2025లో శిలాజ ఇంధనేతర వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న జాతీయ లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే చేరుకుందని ఐఈఏ పేర్కొంది.
సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు చేరడం ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపింది.

