నీటిని రాజకీయ అస్త్రంగా మార్చొద్దన్న పాక్ ప్రధాని
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరోసారి చర్చకు వచ్చింది.
మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ఆయుధంగా మార్చకూడదని భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ఒప్పందాలను వాటి అసలు స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హేగ్ కోర్టు తీర్పుపై భారత్ అభ్యంతరం
హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం చెల్లుబాటును సమర్థిస్తూ.. వివాద పరిష్కార యంత్రాంగం కొనసాగుతుందని తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఆ కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
దాని పరిధిని తాము గుర్తించబోమని తేల్చిచెప్పింది.
సదరు ట్రైబ్యునల్ విచారణలో భారత్ పాల్గొనలేదని, ఆ తీర్పులు తమ జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందం నిలిపివేత
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది.
తాజా తీర్పు వచ్చినప్పటికీ ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
ఇదే ఎస్‌సీఓ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని హెచ్చరించారు.
ఉగ్రవాదానికి అందుతున్న నిధులు, నియామకాలు, సురక్షిత స్థావరాలను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు.
దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధు జలాల వివాదం మరోసారి కీలక అంశంగా మారింది.



