కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ ఆమె వెనుక ఉన్నవారి గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పార్టీని ఎవరు పెట్టించారో అందరికీ తెలుసని, అందుకే మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ ఆ పార్టీలో చేరడం లేదని అన్నారు. కవిత స్థాపించిన పార్టీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని, కేవలం తండ్రితో ఉన్న గొడవ కారణంగానే ఆమె పార్టీని ఏర్పాటు చేశారు తప్ప మరో కారణం లేదని అన్నారు. తాను అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నానని, అందువల్లే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానన్నారు. 2008లోనే కవిత తన వద్దకు వచ్చి పార్టీ కోసం రూ.10 కోట్లు ఇవ్వాలని అడిగారని, తాను రూ.15 కోట్లు ఇవ్వాలనుకున్నానని చెప్పారు. కానీ కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని కేసీఆర్ కోరడంతో ఆగిపోయానని చెప్పారు.
ఇక తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని పాల్ చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు తాను డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానని అన్నారు. ఈ యుద్ధం ఆగకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 850 కోట్ల మంది తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
