స్టేషన్ ఘనపూర్‌లో రూ. 18 కోట్ల పనులకు MLA,MP శంకుస్థాపన

January 21, 2026 6:44 PM

మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో మొత్తం రూ. 18 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి వారు శంకుస్థాపన చేశారు.

చాగల్ పరిధిలోని వార్డుల్లో రూ. 4 కోట్లు, శివునిపల్లి వార్డుల్లో రూ. 4 కోట్లు, స్టేషన్ ఘనపూర్ టౌన్ పరిధిలో రూ. 3 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో రూ. 7 కోట్లతో వరద కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గాంధీ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు డివైడర్లు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటివరకు మొత్తం రూ. 25 కోట్ల పనులు ప్రారంభించామని, ఈ పనులన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.త్వరలోనే మరో రూ. 25 కోట్లతో టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ భవనం నిర్మిస్తామని వెల్లడించారు.ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసి అదనంగా మరో రూ. 50 కోట్లు సాధిస్తామని, స్టేషన్ ఘనపూర్‌ను జిల్లాలోనే అగ్రగామిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media