రూ.100 కోట్ల ఈ-వే బిల్లుల వ్యవహారం వెలుగులోకి
జీఎస్టీ ఎగవేత రూ.16.96 కోట్లుగా అంచనా
హైదరాబాద్: నకిలీ గ్రానైట్ బిల్లింగ్, పన్ను ఎగవేత కేసులో కరీంనగర్‌కు చెందిన వ్యాపారి శ్రీకాంత్‌ను Directorate General of GST Intelligence హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
అరెస్టు అనంతరం ఆయనను నాంపల్లిలోని ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
గత రెండు రోజులుగా కరీంనగర్‌లోని పలు గ్రానైట్ దుకాణాలు, రవాణా సంస్థల కార్యాలయాల్లో డీజీజీఐ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నకిలీ కంపెనీ పేరుతో రూపొందించిన ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ రవాణా జరిగినట్లు గుర్తించారు.
ఈ భారీ గ్రానైట్ సిండికేట్‌లో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. ఆయన సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ-వే బిల్లులు రూపొందించినట్లు వెల్లడించారు.
అయితే ఆ సరఫరాలకు సంబంధించిన వివరాలు జీఎస్టీ రిటర్నుల్లో కనిపించలేదని పేర్కొన్నారు. వాటికి ఎలాంటి పన్ను కూడా చెల్లించలేదని తెలిపారు.
శ్రీకాంత్ నిర్వహించిన వ్యాపార లావాదేవీల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.16.96 కోట్లుగా అంచనా వేశారు.
శేరిలింగంపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లోని గ్రానైట్ దుకాణాల్లో కూడా అక్రమ సరుకు స్వాధీనం చేసుకున్నారు. ప్రజ్ఞాపూర్ వద్ద లారీల్లో ఉన్న గ్రానైట్ స్లాబ్‌లను కూడా అధికారులు సీజ్ చేశారు.
ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

