న్యూఢిల్లీ: తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ కేంద్రంలో వచ్చే ఐదేళ్లలో 200 ఆధునిక ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నారు. దేశవ్యాప్తంగా సమీప పట్టణాలు, నగరాల మధ్య తక్కువ ఖర్చుతో తరచూ రైలు సేవలు అందించడమే లక్ష్యం.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ గురువారం ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ రైళ్లు సుమారు 300 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాల్లో అనేక స్టాప్‌లతో నడుస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారికి ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
20 బోగీలతో ఉండే ఈ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన గాలి ప్రసరణ, అధిక భద్రతా సౌకర్యాలు ఉంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే వీటిలో రీజెనరేటివ్ బ్రేకింగ్ సాంకేతికతను అమర్చనున్నారు. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

