కేంద్రంపై మా పోరాటాన్ని అడ్డుకోవడమేంది?.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

July 24, 2026 3:14 PM
KTR addressing media over protest against Central Government.

హైదరాబాద్: పేపర్ లీకేజీలు, నిరుద్యోగ యువత సమస్యలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపి నాయకత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇందిరా పార్క్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరిన తమ కార్లను అడ్డుకోవడం వెనుక అంతర్యమేమిటని ఆయన నిలదీశారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల వైఫల్యాలను ఎండగడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కావడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులు, విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం

“మేము మోదీ తప్పు చేశారని అంటుంటే, ఈ ‘కోత బాయ్’ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు? యూత్ కాంగ్రెస్ వాళ్లు వచ్చి నా కారును అడ్డుకోవడం, పోలీసులు దౌర్జన్యం చేయడం ఈ రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో చెప్పకనే చెబుతోంది” అని మండిపడ్డారు.

కొడంగల్‌లో దాక్కున్నారా?
ఢిల్లీలో రాహుల్ గాంధీ నిరసనకు దిగితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా కొడంగల్‌లో దాక్కున్నారని కేటీఆర్ విమర్శించారు.

కనీసం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఉన్నంత పౌరుషం కూడా రేవంత్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు.

స్వయంగా తమ పార్టీ అగ్రనేత కోసం పోరాడకుండా, ఏదో డ్రామా చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను సాధించి, ఢిల్లీ మెడలు వంచిన చరిత్ర బీఆర్ఎస్‌ది.

మోదీని గల్లా పట్టి అడిగే ధైర్యం మాకుంది. కానీ, పాత కేసులు, నోట్ల బ్యాగుల కేసులలో లోపల వేస్తారనే భయంతో రేవంత్ రెడ్డి మోదీకి భయపడుతున్నారు కేటీఆర్.

పేపర్ లీకేజీల అంశంలో తనపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ననే ఈ విషయమై లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు.

“రేవంత్ రెడ్డి, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ దగ్గర పిల్లల ముందే నన్ను ఉరితీయండి.

అంతేకానీ నిరుద్యోగుల మనసులను మలినం చేస్తూ, రాజకీయ చలిమంటలు కాచుకోవద్దు” అని తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి వైఖరి ‘చిత్రం’ సినిమాలో బాబు కుక్క కథలాగా, దేనికి అడిగినా “కేసీఆర్.. కేసీఆర్” అనడమే సరిపోతుందని సెటైర్లు వేశారు.

నిరుద్యోగులు, విద్యార్థులు జంతర్ మంతర్ వేదికగా చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని, అయితే తాము నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లకపోవడానికి ఒక బలమైన కారణం ఉందన్నారు.

విద్యార్థులు స్వతంత్రంగా పోరాడాలని, వెనుక ఉండి లీగల్ సమస్యలొచ్చినా, పార్లమెంట్, అసెంబ్లీ, శాసనమండలిలో గొంతు విప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ వేదికగానే కేంద్ర బీజేపి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ విద్యార్థులకు అండగా ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media