మియాపూర్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ అప్రమత్తతతో భారీగా గంజాయి పట్టుబడింది. మార్కెట్లో సుమారు రూ.20 లక్షల విలువ చేసే 18 కిలోల గంజాయిని మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 30 రాత్రి 8 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి ఔరంగాబాద్ వెళ్లేందుకు షిర్డీకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ లగేజీ బ్యాగ్‌ను ఎక్కించే ప్రయత్నం చేశారు. బ్యాగ్‌పై అనుమానం వచ్చిన కండక్టర్ అందులో ఏముందని ప్రశ్నించాడు. దీనికి వారు పొంతనలేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో అనుమానం పెరగడంతో కండక్టర్ వెంటనే ఆ బ్యాగ్‌ను మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. పోలీసులు పంచుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా అందులో సుమారు 18 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు గంజాయి రవాణా వెనుక ఉన్న ముఠాను గుర్తించే పనిలో పడ్డారు. పరారైన ఆరుగురు వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
భారీ మొత్తంలో మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్‌ను కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సన్మానించి నగదు ప్రోత్సాహకం అందజేశారు.
“సమాజ భద్రత కోసం ప్రతి పౌరుడు ఇలాగే అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని డీసీపీ రితిరాజ్ సూచించారు.

