ఫ్లూకు కొత్త mRNA వ్యాక్సిన్

June 19, 2026 4:54 PM
FDA

మోడెర్నా ‘mFlusiva’కు అనుమతి దిశగా అడుగులు

వృద్ధులకు మరింత రక్షణ కల్పించే అవకాశం.. FDA పరిశీలన

వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన mRNA సాంకేతికతతో రూపొందించిన తొలి ఫ్లూ వ్యాక్సిన్‌పై అమెరికా ఆరోగ్య నిపుణులు గురువారం చర్చలు జరిపారు.

ఔషధ సంస్థ మోడెర్నా అభివృద్ధి చేసిన ‘mFlusiva’ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి కోరుతోంది.

50 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని మోడెర్నా ప్రతిపాదించింది. రాబోయే శీతాకాల ఫ్లూ సీజన్‌కు ముందే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రతి ఏడాది వేలాది మరణాలు

అమెరికాలో ప్రతి ఏడాది ఫ్లూ కారణంగా పదివేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో పలు రకాల ఫ్లూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

వాటిలో 65 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకంగా సిఫారసు చేసిన మూడు టీకాలు కూడా ఉన్నాయి.

అయితే mRNA సాంకేతికతతో తయారయ్యే వ్యాక్సిన్లు వేగంగా ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్లూ వైరస్‌లో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు కొత్త టీకాలను త్వరగా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అధ్యయనంలో మెరుగైన ఫలితాలు

50 ఏళ్లు పైబడిన 40 వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో మోడెర్నా mRNA వ్యాక్సిన్, ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరో ఫ్లూ వ్యాక్సిన్‌తో పోలిస్తే ఫ్లూ కేసులను సుమారు 27 శాతం మేర తగ్గించినట్లు తేలింది.

సమావేశానికి ముందు FDA విడుదల చేసిన సమీక్ష నివేదికలో కూడా ఈ డేటాను అనుకూలంగా విశ్లేషించింది. ఇప్పటివరకు ఎలాంటి భద్రతా సమస్యలు గుర్తించలేదని తెలిపింది.

65 ఏళ్లు పైబడిన వారిపై మరింత పరిశోధన

50 నుంచి 64 ఏళ్ల వయస్సు గల వారికి పూర్తి అనుమతి ఇవ్వాలని మోడెర్నా కోరుతోంది. అదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వారికి అదనపు పరీక్షలు కొనసాగిస్తూ అత్యవసర అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది.

వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే 65 ఏళ్లు పైబడిన నాలుగు లక్షల మందిపై మరో భారీ అధ్యయనం చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇందులో సగం మందికి mRNA వ్యాక్సిన్, మిగిలిన వారికి ప్రస్తుతం వృద్ధులకు అందిస్తున్న ఫ్లూ టీకాలను ఇస్తారు.

వేగవంతమైన ఉత్పత్తి ప్రధాన బలం

మోడెర్నా వైద్య నిపుణురాలు డాక్టర్ రితుపర్ణా దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యాపిస్తున్న ఫ్లూ వైరస్ రకాల‌కు అత్యంత దగ్గరగా సరిపోయే టీకాలను mRNA సాంకేతికతతో వేగంగా తయారు చేయవచ్చని చెప్పారు.

దీని వల్ల వృద్ధుల్లో ఆస్పత్రి చేరికలను వేల సంఖ్యలో తగ్గించే అవకాశం ఉందని వివరించారు.

ఫ్లూ వ్యాక్సిన్ వైరస్‌కు సరిపోని సంవత్సరాల్లో తీవ్రమైన కేసులు ఎక్కువగా నమోదవుతాయని ఆమె పేర్కొన్నారు.

FDAలో వివాదానికి దారితీసిన దరఖాస్తు

ఈ ఏడాది ప్రారంభంలో మోడెర్నా సమర్పించిన డేటాపై FDAలో వివాదం చోటుచేసుకుంది. అప్పటి టీకాల విభాగాధిపతి డాక్టర్ వినయ్ ప్రసాద్, వృద్ధులకు సిఫారసు చేసే అధిక మోతాదు ఫ్లూ టీకాతో పోల్చి అధ్యయనం చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.

అయితే ప్రధాన అధ్యయన రూపకల్పనకు FDA సిబ్బంది ముందుగానే ఆమోదం తెలిపారని మోడెర్నా వాదించింది.

అలాగే వృద్ధులకు ఇచ్చే అధిక మోతాదు టీకాతో పోల్చిన మరో చిన్న అధ్యయన ఫలితాలను కూడా సమర్పించింది.

కొద్ది రోజుల తర్వాత FDA మోడెర్నా దరఖాస్తును స్వీకరించింది.

ఇంకా ఉన్న సందేహాలు

చిన్న అధ్యయనంలో మోడెర్నా వ్యాక్సిన్, వృద్ధులకు ఇచ్చే అధిక మోతాదు ఫ్లూ టీకా మాదిరిగానే ఫ్లూపై పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు తేలింది.

అయితే చాలా బలహీన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై తగిన డేటా ఇంకా అందుబాటులో లేదని FDA ప్రారంభ సమీక్షలో పేర్కొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media