ప్రజలకు ఇబ్బందులు తగ్గించే చర్యలకు మోదీ ఆదేశం
2047 లక్ష్యంగా తదుపరి తరం సంస్కరణలపై దృష్టి
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావంపై ప్రధాని Narendra Modi గురువారం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ప్రజలు, ప్రభావిత రంగాలకు ఇబ్బందులు తగ్గించే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సూచించినట్లు తెలిసింది.
మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర మంత్రివర్గ మండలితో మోదీ నిర్వహించిన తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష జరిగింది.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును కూడా సమావేశంలో పరిశీలించారు. ప్రజలకు సేవలు మరింత సమర్థంగా చేరేలా చర్యలపై చర్చించారు.
సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 2047 లక్ష్యంగా పని చేయాలని మోదీ మంత్రులకు సూచించినట్లు పీటీఐ తెలిపింది.
భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి దేశం సమగ్ర అభివృద్ధి సాధించేలా తదుపరి తరం సంస్కరణలపై గరిష్ఠ దృష్టి పెట్టాలని మోదీ చెప్పినట్లు వర్గాలు వెల్లడించాయి.
“ప్రజల జీవితం మరింత సౌకర్యవంతంగా మారేలా సంస్కరణలు చేపట్టాలి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు ఉండాలి” అని మోదీ పేర్కొన్నట్లు సమాచారం.

