హైదరాబాద్: హైదరాబాద్లో సంచలనం రేపిన న్యాయవాది ముయిజుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత ఆలంఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్తో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
భూ వివాదాలే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. తన భూముల వ్యవహారంలో ముయిజుద్దీన్ అడ్డుగా మారుతున్నాడనే కారణంతో ఆలంఖాన్ సుపారీ ఇచ్చి హత్య చేయించాడని వెల్లడించారు. ఈ హత్య కోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.
హత్య అనంతరం నిందితులు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలు వారిని పట్టుకుని హైదరాబాద్కు తీసుకొచ్చాయి. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.
ముయిజుద్దీన్ను వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. న్యాయవాదిని హత్య చేసేందుకు నిందితులు రెండేళ్ల కాలంలో పది సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు పక్కా ప్రణాళికతో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు.
ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

