ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి మెరుపు సోదాలు నిర్వహించారు. మద్యం వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తిరుపతి రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. మద్యం వ్యాపారుల నుంచి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజును ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. మద్యం వ్యాపారిపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్న సీఐ మాతంగి బాబీ ఆదేశాల మేరకే ఈ వసూళ్లు జరుగుతున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో సీఐని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెలవారీ మామూళ్ల కోసం మద్యం షాపు మేనేజ్‌మెంట్‌ను వేధిస్తూ, రూ. 45,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరికి రూ. 30,000 కు ఒప్పందం కుదుర్చుకోగా, బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ వల పన్నింది.CI బాబీ నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ అవినీతి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల హస్తం ఉందా అనే కోణంలో అడిషనల్ ఎస్పీ విమల కుమారి రికార్డులను పరిశీలిస్తున్నారు.
