ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ శనివారం దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ ఆలయానికి విచ్చేశారు.

నారా రోహిత్‌కు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, బీజేపీ రాష్ట్ర నేత బుచ్చిరాజు మరియు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న రోహిత్, అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు సుమారు రూ.కోటి వ్యయంతో బహుకరించిన నూతన టేకు రథాన్ని నారా రోహిత్ ప్రారంభించారు. రథ శిఖరానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి, శిఖర ప్రతిష్ట చేశారు.ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు రోహిత్‌ను దుశ్శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
