ఉదయగిరి పోలీసులు భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామ సమీపంలో గ్రామస్థులు అప్రమత్తమై ఒక వాహనాన్ని అడ్డుకోగా, అందులో ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గమనించి నిందితులు అప్పట్లో వాహనాన్ని వదిలి పరారయ్యారు.

పరారైన నిందితుల కోసం ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి ప్రత్యేక నిఘా ఉంచారు. సాంకేతిక ఆధారాల సాయంతో స్మగ్లర్ల కదలికలను కనిపెట్టారు. నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహస్వామి కొండ సమీపంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిని మాలకొండయ్య (ఆర్లపడియ), నాగార్జున (ఉప్పరపల్లి), ఖాజా రసూల్ (కరటం పాడు), రమణయ్య, షాన్, తిరుపతయ్య (నెల్లూరు బీబీనగర్) గా గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ. 20 లక్షల విలువ చేసే 34 ఎర్రచందనం దుంగలు, ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గ్రామస్థుల అప్రమత్తత, పోలీసుల పట్టుదల వెరసి అంతర్ జిల్లా స్మగ్లింగ్ ముఠా కటకటాల పాలైంది.
