శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ సకల దేవతలకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆహ్వానం పలికారు.

గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభంపై గరుత్మంతుడి ప్రతిమను ఎగురవేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను అలంకరించి తిరుచ్చిపై కోలువుదీర్చి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఇదిలా ఉండగా, ధ్వజారోహణ సందర్భంగా ఇచ్చే ప్రసాదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గరుత్మంతుడికి సమర్పించిన ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కొడిముద్దల కోసం పోటీపడ్డారు.
