పెందుర్తి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు (MPP) ముదపాడ నాగమణిపై కూటమి ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆర్డీవో (RDO) సుధా సాగర్‌ను కలిసిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎంపీటీసీలతో కలిసి అవిశ్వాస తీర్మాన పత్రాలను అందజేశారు.
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని చూస్తున్నా, ఎంపీపీ సహకరించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడి నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పదవీ కాలం మరో 8 నెలలు మాత్రమే ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లలో జరగని అభివృద్ధిని ఈ స్వల్ప కాలంలోనే చేసి చూపిస్తామని, పెందుర్తి మండలాన్ని ‘స్వర్ణయుగం’గా మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ (NDA) కూటమికి చెందిన ఎంపీటీసీలు, కీలక నేతలు భారీ సంఖ్యలో పాల్గొని ఎంపీపీకి వ్యతిరేకంగా గళమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీవో నిర్ణయం తీసుకున్న అనంతరం తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు నేతలు వెల్లడించారు.
