సౌదీ అరేబియా చమురు ధరల కోతతో మార్కెట్లో సానుకూల సంకేతాలు
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తగ్గిన ముడి చమురు ధరలు రూపాయికి ఊతం
ముంబై: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 15 పైసలు బలపడి( Rupee rises ) 95.28 వద్ద ట్రేడైంది.
సౌదీ అరేబియా ఆసియా దేశాల కోసం ఆగస్టు నెల ముడి చమురు ధరలను భారీగా తగ్గించినట్లు వచ్చిన వార్తలతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం కూడా రూపాయికి మద్దతుగా నిలిచింది.
ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 95.33 వద్ద ప్రారంభమై, తర్వాత 95.28 వరకు చేరింది. సోమవారం ముగింపు ధర 95.43తో పోలిస్తే ఇది 15 పైసల లాభం.
Finrex Treasury Advisors LLP ట్రెజరీ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ మాట్లాడుతూ, సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో సౌదీ అరేబియా ఆసియా కొనుగోలుదారుల కోసం బ్యారెల్‌కు 11 అమెరికన్ డాలర్ల మేర ధర తగ్గించిందన్నారు.గత 26 ఏళ్లలో ఇది రికార్డు స్థాయి కోత అని వివరించారు.
అలాగే Indian Oil, HPCL కలిసి 70 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు టెండర్లు పిలిచాయని ఆయన చెప్పారు.
దీంతో గత కొన్ని రోజులుగా అమెరికా డాలర్‌కు డిమాండ్ కొనసాగుతోందన్నారు.
ఇదిలా ఉండగా, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 100.86 వద్ద 0.01 శాతం పెరుగుదలతో ట్రేడైంది.
అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ధర 0.64 శాతం పెరిగి 72.45 అమెరికన్ డాలర్లకు చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో కూడా సానుకూల ధోరణి కనిపించింది.
ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 176 పాయింట్లు పెరిగి 78,461.16 వద్ద ఉండగా, నిఫ్టీ 34.10 పాయింట్లు పెరిగి 24,464.45 వద్ద ట్రేడైంది.
స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) దేశీయ ఈక్విటీ మార్కెట్లో రూ.243.03 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.



