విజయనగరం జిల్లా శృంగవరపుకోట (ఎస్.కోట)లో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. విశాఖపట్నం అప్పుఘర్ ప్రాంతానికి చెందిన రంగ (70) అనే వృద్ధుడిపై కుక్కల గుంపు కనికరం లేకుండా దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి ముఖం పూర్తిగా ఛిద్రమై పరిస్థితి విషమంగా మారింది.
మతిస్థిమితం లేని రంగ ఎస్.కోట పరిసరాల్లో సంచరిస్తుండగా, ఒక్కసారిగా చుట్టుముట్టిన కుక్కలు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఆయన ముఖం, మెడ భాగంలో లోతైన గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టి, బాధితుడిని వెంటనే ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు రంగను విశాఖపట్నం KGHకు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ మృత్యువుతో పోరాడుతున్నారు. ఎస్.కోటలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రాత్రి వేళ బయటకు రావాలంటేనే వణుకుపుడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
