భారత దేశ రెండో రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుట్టణిలో జన్మించిన రాధాకృష్ణన్ మూలాలు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందాయి. విద్య, తత్వశాస్త్ర రంగాల్లో ఆయన చేసిన కృషి అపారమైంది.భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా (1952–1962), అనంతరం రెండో రాష్ట్రపతిగా (1962–1967) సేవలందించిన ఆయన, విద్యకు అపారమైన ప్రాధాన్యత ఇచ్చారు. తన జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని కోరడంతో, సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు.1954లో భారత రత్న పురస్కారం అందుకున్న ఆయన, తూర్పు-పాశ్చాత్య తత్వాల మధ్య సేతగా నిలిచారు. విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సాదాసీదా జీవన విధానం అందరికీ ఆదర్శం. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తన జీతంలో పెద్ద భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు.1975 ఏప్రిల్ 17న ఆయన కన్నుమూశారు. ఆయన జీవితం, సేవలు భారత విద్యా వ్యవస్థకు మార్గదర్శకంగా నిలిచాయి.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఈ సందర్భంగా దేశం స్మరించుకుంటోంది.పేద వృద్ధుల సంక్షేమం కోసం పనిచేసే ‘హెల్ప్ఏజ్ ఇండియా’ సంస్థ స్థాపకుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి ముందు జీడీ బిర్లా తదితరులతో కలిసి ‘కృష్ణార్పణ్ చారిటీ ట్రస్ట్’ను స్థాపించి సామాజిక సేవలకు శ్రీకారం చుట్టారు.తత్వశాస్త్రంలో ‘అభేద’ సిద్ధాంతాన్ని ప్రాముఖ్యంగా ప్రతిపాదించిన రాధాకృష్ణన్, వేదాంతంలో అద్వైత భావనను ప్రపంచానికి పరిచయం చేశారు. బ్రహ్మమే పరమ సత్యమని, ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధికంటే అనుభూతి ముఖ్యమని ఆయన వివరించారు.విద్య, తత్వం, సేవల ద్వారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి.
