నటి శిల్పా షిండే పాపులర్ షో ‘భాబీజీ ఘర్ పర్ హై!’ నిర్వాహకులతో జరిగిన వివాదాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. 2016లో ఆ షో నుండి బయటకు వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాత, నిర్మాత సంజయ్ కోహ్లీపై తాను చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని ఆ నటి అంగీకరించారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ఈ వివాదం గురించి మాట్లాడుతూ, ఆ సమయంలో తనకు మరో మార్గం లేదని భావించి ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత ఆ విషయం రాజీపడటంతో తనకు రావలసిన డబ్బులు కూడా చెల్లించారని శిల్పా తెలిపారు.
నటి భారతి సింగ్, రచయిత హర్ష్ లింబచయ్యాల పోడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా శిల్పా మాట్లాడుతూ తాను నిజం చెప్పడానికి భయపడడం లేదన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, నిజం చెప్పడానికి నేను భయపడను. ఇది చాలా పెద్ద విషయం కాబట్టి ఈ రోజు కూడా ఈ విషయం చెబుతానని తెలిపారు. నాకు వేరే మార్గం లేకపోవడంతో నా నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు పెట్టాను. చివరికి, ఆ విషయం రాజీపడటంతో నేను అందులో నుంచి బయటపడ్డానని స్పష్టం చేశారు.

