సూర్యనారాయణ స్వామి వెలసిన అరసవల్లి పుణ్యక్షేత్రంలో రథసప్తమి మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

DSP వివేకానందతో కలిసి ఎస్పీ క్యూ లైన్లు, విఐపి దర్శన మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేశారు. రథసప్తమి నాడు భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సీసీ కెమెరాల నిఘాతో ప్రతి కదలికను గమనించాలని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.
