తిరుమలలో భక్తుల వెల్లువ.. 18 గంటల నిరీక్షణ
భద్రతపై సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవమన్న టీటీడీ
జూన్ 11న హుండీ బియ్యం ఈ–వేలం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ప్రస్తుతం సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది.
శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్నవారు మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు.
భద్రతపై తప్పుడు ప్రచారం
తిరుమలలో భద్రతా చర్యలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది.
తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థ నిరంతరం అమల్లో ఉందని అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
వేసవి సెలవులు ముగిసే దశలో ఉండటంతో రాబోయే రోజుల్లో కూడా రద్దీ కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణం చేయాలని సూచించారు.
వసతి గృహాలు అందుబాటులో లేకపోతే తిరుపతిలో బస చేసి దర్శనానికి రావాలని కోరారు.
దర్శనాల సంఖ్యలో కొత్త రికార్డు
సోమవారం తిరుమల శ్రీవారిని మొత్తం 95,152 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,601 మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించారు.
అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు నమోదైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజులోనే 4.21 లక్షల లడ్డూలు విక్రయించారు.
అన్నప్రసాదాన్ని 2.83 లక్షల మంది భక్తులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ సేవల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
జూన్ 11న హుండీ బియ్యం ఈ–వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బియ్యాన్ని జూన్ 11న ఈ–వేలం ద్వారా విక్రయించనున్నారు.
మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల బియ్యాన్ని వేలానికి ఉంచనున్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు జూన్ 10 ఉదయం 10 గంటలలోపు కొనుగోలు పోర్టల్‌లో రూ.50 వేల ఈఎండీ చెల్లించాలని అధికారులు సూచించారు.
వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 0877-2264429.
అలాగే కొనుగోలు పోర్టల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Also Read

