దొంగతనం కేసు విచారణలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో బంగారు ఆభరణాల చోరీ కేసు విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లిన చీకటి గోపి నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
గోపిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
పొన్నెకల్లు గ్రామంలో బంగారు ఆభరణం చోరీ జరిగింది. ఈ కేసులో గ్రామానికి చెందిన గోపిక్రిష్ణ, శాంతిరాజు, చీకటి గోపిలను గత నెల 25వ తేదీన పోలీసులు విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లారు.
రెండు రోజుల పాటు విచారించిన తర్వాత చీకటి గోపి అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించామని, ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పామని కుటుంబ సభ్యులు తెలిపారు.
గత నెల 27వ తేదీన చీకటి గోపిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
అతడు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పరిస్థితి మరింత విషమించడంతో గోపిని జిజిహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడ నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన గోపి నిన్న మృతి చెందాడు.
పోలీసులపై భార్య ఆరోపణలు
గోపి మృతితో అతని భార్య జ్యోతి, బంధువులు జిజిహెచ్‌లో ఆందోళనకు దిగారు.
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే తన భర్త అనారోగ్యానికి గురై మృతి చెందాడని జ్యోతి ఆరోపించింది.
చోరీ కేసులో పోలీసులు తన భర్తను రెండు రోజుల పాటు స్టేషన్‌లో ఉంచి లాఠీలతో కొట్టారని, మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను చూపిస్తూ ఆమె ఆరోపించింది.
తన భర్తకు దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదని జ్యోతి చెప్పింది.
విచారణ పేరుతో తీసుకెళ్లి హింసించారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఎలాంటి కేసు నమోదు చేయకుండా రెండు రోజుల పాటు ఎలా అదుపులో ఉంచుకుంటారని ప్రశ్నించింది.
పోలీసులు ఏమంటున్నారు?
అయితే తాడికొండ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. తాము చీకటి గోపిని కొట్టలేదని చెప్పారు.
చోరీలో భాగస్వామ్యం ఉన్న ముగ్గురిని విచారణ కోసం తీసుకెళ్లామని, విచారణలో పలు దొంగతనాలు చేసినట్లు తేలిందని తెలిపారు.
విచారణలో ఉండగానే చీకటి గోపి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి అతడిని పంపించామని పోలీసులు వివరించారు.
మరోవైపు గోపి మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



