మరో మూడు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా…రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం, నిషేధిత పదార్థాలు పట్టుబడ్డాయి. ఇప్పటివరకు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం విలువ రూ.1,200 కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో రూ.500 కోట్లకు పైగా నగదు ఉంది.

ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, కూపన్లు, ఉచిత బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 100 కేసులు నమోదయ్యాయి.జిల్లాల వారీగా చూస్తే తిరువళ్లూర్‌లో అత్యధిక నగదు స్వాధీనం చేసుకోగా, చెన్నై రెండో స్థానంలో ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
అయితే, పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం రాజకీయంగా చర్చానీయాంశంమైంది. కొన్ని రాజకీయ పార్టీలు ఈ తనిఖీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సంక్షేమ పథకాల కింద పంపిణీ చేయాల్సిన నిధులు కూడా నిలిపివేస్తున్నారని ఆరోపించాయి.
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

