హైదరాబాద్: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ దఫాబెట్ వ్యవహారంపై తెలంగాణ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) భారీ చర్యలు చేపట్టింది. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.9.95 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎనిమిది స్థాయిలుగా విస్తరించిన 46 మ్యూల్ బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్న అంతర్రాష్ట్ర నేర ముఠాను అధికారులు ఛేదించారు.
ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో ఆపరేషన్లు
దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో సీఐడీ బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో కీలక నిర్వాహకులు, సాంకేతిక సహాయక సిబ్బంది, మ్యూల్ ఖాతాలు అందించిన వ్యక్తులు సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు.
క్రికెట్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్, ఏవియేటర్ బెట్టింగ్ పేర్లతో సులభంగా డబ్బు సంపాదించవచ్చని చెప్పి బాధితులను మోసగాళ్లు ఆకర్షించినట్లు అధికారులు గుర్తించారు. మొదట కొంత మొత్తాన్ని గెలుపుల రూపంలో చెల్లించి బాధితుల్లో నమ్మకం పెంచేవారని, తర్వాత పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టేవారని దర్యాప్తులో తేలింది.
సోదాల్లో మూడు లగ్జరీ కార్లు, ఎనిమిది ల్యాప్‌టాప్‌లు, 26 మొబైల్ ఫోన్లు, ఐదు పాస్‌పోర్టులు, రూ.3.21 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, కియా కార్లు ఉన్నాయి.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సులభంగా డబ్బు వస్తుందనే ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ సీఐడీ సూచించింది.

