తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం
- తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
- తెలంగాణలో 5 జిల్లాలకు అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది.
- ఏపీ, తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీవ్ర వాయుగుండం బలహీనం
ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
గడిచిన 6 గంటల్లో తీవ్ర వాయుగుండం గంటకు 7 కిమీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది కళింగపట్నంకు 70 కిమీ, రాయగడ (ఒడిశా)కు 80 కిమీ దూరంలో ఉందని అధికారులు తెలిపారు.
సాయంత్రానికి తీవ్ర వాయుగుండం వాయుగుండంగా బలహీనపడనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటినప్పటికీ గురువారం, శుక్రవారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్‌గా ఉండాలని సూచించారు.
సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని చెప్పారు. చెరువులు నింపడంపై దృష్టి పెట్టడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 5 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అతి భారీ వర్ష సూచనతో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, భారీ వర్ష సూచనతో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో, కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


