మియాపూర్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న ప్రజాప్రతినిధుల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎఫ్సీఐ కాలనీలోని సెంట్ రీటా స్కూల్ వెనుక ప్రాంతంలో గత ఐదు నెలలుగా మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

మురుగు సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా తాత్కాలికంగా వచ్చి చెత్త తీసి వెళ్తున్నారని, రెండు రోజులకే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోందని స్థానికుడు ఎరవేని శ్రీకాంత్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 200 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకునే నాయకులు, ఈ మురుగు నీరు ఎందుకు నిలుస్తోందో సమాధానం చెప్పాలని ఎంసీపీఐ నాయకులు పల్లె మురళీ ప్రశ్నించారు. నిలిచిన మురుగు నీటి వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
