తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. వేసవి సెలవుల వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. రెండు మూడు రోజులుగా రద్దీ కొనసాగుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకూ క్యూ లైన్ విస్తరించింది.
ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా ఉదయం క్యూలైన్‌లోకి వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తవడానికి సుమారు 24 గంటలు పడుతోంది. టైమ్‌స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటలు, శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్నవారికి ఐదు గంటల సమయం పడుతోంది.
రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్‌లోకి రావాలని తెలిపింది. ప్రకటన తర్వాత పలువురు భక్తులు పీఏసీలకు వెళ్లిపోయారు. సీఆర్వో కార్యాలయం దగ్గర కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. కళ్యాణకట్టలోనూ రద్దీ కనిపిస్తోంది. తలనీలాల సమర్పణ కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
తిరుమలలో పరిస్థితిని టీటీడీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీని గమనిస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొండపై రద్దీని గమనించి తిరుమలకు రావాలని టీటీడీ సూచించింది.
నిన్న ఒక్కరోజే 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

