ఒకే ఒక్క ఓటుతో.. తిరుపత్తూర్ విజయ్ పార్టీదే

May 5, 2026 2:19 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా ఉన్న డీఎంకే (DMK) సీనియర్ నేత కే.ఆర్. పెరియకరుప్పన్ తిరుపత్తూర్ నియోజకవర్గంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. నటుడు విజయ్‌కి చెందిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో పెరియకరుప్పన్ పరాజయం పాలయ్యారు. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించగా, పెరియకరుప్పన్ కు 83,374 ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో TVK పార్టీ గెలుపులో భాగం కావాలని మస్కట్ నుంచి ఒక మహిళ ప్రత్యేకంగా వచ్చి మరీ ఓటు వేశారు. ఒక్క ఓటుతోనే విజయం తారుమారు కావడంతో, ఆమె వేసిన ఓటు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఆ మహిళ, “దళపతి విజయ్ కోసం మస్కట్ నుంచి ఇండియాకు వచ్చి మరీ ఓటు వేసినందుకు నేను గర్వపడుతున్నాను” అని ట్వీట్ చేశారు.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార డీఎంకే (DMK) 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం కాగా, అన్నాడీఎంకే (AIADMK) 47 స్థానాలు గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ (INC) 5 స్థానాలు, పీఎంకే (PMK) 4 స్థానాలు దక్కించుకున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media