భోపాల్: మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుని కొత్తగా దర్యాప్తు ప్రారంభించింది. భోపాల్‌లోని ఆమె అత్తింట్లో జరిగిన ఈ ఘటనపై వచ్చిన ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతుగా పరిశీలిస్తోంది.
భోపాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ సోమవారం మళ్లీ నమోదు చేసింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్‌పై కేసు పెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్ బృందం స్థానిక పోలీసుల వద్ద ఉన్న కేసు డైరీ, పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య రికార్డులు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
డౌరీ డెత్‌కు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత దర్యాప్తులో కట్నం వేధింపులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారుడిగా పేర్కొన్నారు.
సమర్థ్ వాంగ్మూలంపై అనుమానాలు
మూడు రోజుల పాటు దాదాపు 10 గంటల విచారణలో సమర్థ్ సింగ్ పలువురు కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. ట్విషాతో తన సంబంధం సమస్యాత్మకంగా మారిందని ఒప్పుకున్నప్పటికీ, ఆమెపై ఎప్పుడూ శారీరక దాడి చేయలేదని చెప్పాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అయితే అవి దాంపత్య సమస్యలేనని పేర్కొన్నాడు.
మార్చి వరకు తమ వివాహ జీవితం సాధారణంగానే సాగిందని, ట్విషా సోదరుడి పెళ్లి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయని విచారణలో తెలిపాడు.
పెళ్లికి ముందు ఇద్దరూ ఎలా పరిచయం అయ్యారు, ఎంతకాలం స్నేహం కొనసాగింది, పెళ్లి తర్వాత ఐదు నెలల్లో ఏమి మారింది వంటి అంశాలపై పోలీసులు ప్రశ్నించారు. పెళ్లి తర్వాత ట్విషా ఎన్ని సార్లు పుట్టింటికి వెళ్లింది, స్వచ్ఛందంగా వెళ్లిందా లేక కుటుంబ కలహాల వల్ల వెళ్లిందా అన్న విషయాలపైనా ఆరా తీశారు.
గర్భం, అబార్షన్ అంశంపై కీలక మలుపు
ట్విషా గర్భం, అబార్షన్ అంశం విచారణలో అత్యంత సున్నితంగా మారింది. తాను తండ్రి కావాలని కోరుకున్నానని, కానీ ట్విషాకు పిల్లలు వద్దనిపించిందని సమర్థ్ చెప్పినట్లు సమాచారం. వైద్యుల సలహాతో, ట్విషా ఒత్తిడిపైనే అబార్షన్ జరిగిందని తెలిపాడు. ఇద్దరూ కలిసి డాక్టర్‌ను కలిసిన తర్వాత మందులు తీసుకుని గర్భస్రావం జరిగిందని వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఈ వాదన నిజమా కాదా అన్నది తెలుసుకునేందుకు పోలీసులు వైద్య రికార్డులు, సంబంధిత పత్రాలు సేకరిస్తున్నారు.
అయితే ట్విషా వాట్సాప్ సందేశాలు ఈ కేసుకు కొత్త మలుపు తిప్పాయి. గర్భంపై సమర్థ్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు, పుట్టబోయే బిడ్డ తండ్రిత్వంపై ప్రశ్నించినట్లు చాట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో సమర్థ్ చెప్పిన వాదనలకు విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది.
“నేను, మా తల్లి బిడ్డను కోరుకున్నాం. కానీ గర్భం దాల్చినప్పటి నుంచే ట్విషా మానసిక ఒత్తిడికి గురైంది” అని సమర్థ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అయితే గర్భానికి సంబంధించిన సమస్యల తర్వాతే ట్విషాకు మానసిక చికిత్స మొదలైందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ట్విషా దాదాపు 15 కిలోల బరువు తగ్గిందని కూడా తెలిపారు.
మానసిక ఆరోగ్యంపై విచారణ
ట్విషాకు బైపోలార్ డిజార్డర్ ఉందని సమర్థ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయేదని, అందుకే వైద్యుడిని చూపించామని తెలిపాడు. వైద్యులు ఆమెకు అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్ ఉందని నిర్ధారించారని వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఈ చికిత్స గురించి ట్విషా కుటుంబానికి సమాచారం ఇచ్చారా? ఎప్పుడు చికిత్స ప్రారంభమైంది? పెళ్లైన కొద్ది నెలల్లోనే సైకియాట్రిస్ట్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది? వంటి అంశాలపై పోలీసులు సమర్థ్‌ను ప్రశ్నించారు.
ట్విషాకు నిద్రమాత్రలు ఇచ్చారన్న ఆరోపణలపై కూడా సమర్థ్ స్పందించాడు. ఒత్తిడి తగ్గించేందుకు వైద్యుల సూచనల మేరకే మందులు ఇచ్చినట్లు చెప్పాడు.
ఈ చికిత్స వైద్యపరంగా అవసరమా? ట్విషా సమ్మతి తీసుకున్నారా? కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా? వంటి అంశాలను సీబీఐ ఇప్పుడు పరిశీలిస్తోంది.
డిలీట్ చేసిన చాట్లపై టెక్నికల్ దర్యాప్తు
సమర్థ్ మొబైల్‌లోని కొన్ని చాట్ లాగ్‌లు డిలీట్ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ట్విషా, ఆమె కుటుంబ సభ్యులతో జరిగిన సంభాషణలను తొలగించినట్లు గుర్తించారు. వాటిని తిరిగి పొందేందుకు టెక్నికల్ బృందం ప్రయత్నిస్తోంది.
ఈ చాట్లు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, ఇంటి నుంచి ఆన్‌లైన్ పని చేయనివ్వలేదని ట్విషా కుటుంబానికి చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలను సమర్థ్ ఖండించాడు. ట్విషానే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలిందని, పెళ్లి తర్వాత ఇద్దరూ ఎక్కువ సమయం కలిసి గడపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.
ఘటన రోజు ఏమి జరిగింది?
ఘటన జరిగిన రోజూ అంతా సాధారణంగానే కనిపించిందని సమర్థ్ పోలీసులకు చెప్పాడు. ఇద్దరూ కలిసి జిమ్‌కు వెళ్లారని, భోజనం చేశారని, వాకింగ్ కూడా చేశారని తెలిపాడు. ఆ రోజు ట్విషా ప్రవర్తనలో అసాధారణం ఏమీ కనిపించలేదని పేర్కొన్నాడు.
అయితే ఈ వాదనలను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, వాట్సాప్ సందేశాలు, వైద్య పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలతో సరిపోల్చి పరిశీలిస్తున్నారు.
అత్త గిరిబాల పాత్రపైనా దృష్టి
రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ పాత్ర కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. కుటుంబ కలహాల సమయంలో తన తల్లి మధ్యవర్తిత్వం చేసేదని సమర్థ్ చెప్పినట్లు సమాచారం. అయితే ప్రతి వివాదంలో అత్త ఎప్పుడూ సమర్థ్‌కే మద్దతు ఇచ్చేదని ట్విషా భావించిందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

