అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయుల గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఎక్కువ మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అమెరికాలోనే ఉండి నేరుగా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసే అవకాశాలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది.
ఇప్పటివరకు విద్యార్థి, పర్యాటక, ఉద్యోగ వీసాలపై అమెరికాలో ఉన్న చాలామంది విదేశీయులు దేశం విడిచిపోకుండా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఈ విధానాన్ని ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ (ఏఓఎస్)’గా పిలుస్తారు. దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించేవారు.
అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన విధాన పత్రం ప్రకారం.. ఇకపై ఏఓఎస్ను “అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చే ఉపశమనం”గా పరిగణిస్తారు. అంటే, చాలా పరిమిత కేసుల్లోనే అనుమతిస్తారు.
ఈ నిబంధనలు తాత్కాలిక, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉన్న వారందరిపై ప్రభావం చూపనున్నాయి. విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక ఉద్యోగులు కూడా ఇందులోకి వస్తారు.
“దీర్ఘకాలంగా అమల్లో ఉన్న వలస చట్టాలు, కోర్టు తీర్పులకు అనుగుణంగా.. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు అమెరికా బయట నుంచి, స్టేట్ డిపార్ట్మెంట్ ద్వారా కాన్సులర్ ప్రక్రియలో పాల్గొనాలి. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది అధికారులు కేసులవారీగా పరిశీలిస్తారు” అని యూఎస్సీఐఎస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాలర్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో చట్టం అసలు ఉద్దేశాన్ని తిరిగి అమలు చేస్తున్నామని చెప్పారు. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారు అనుమతించిన గడువు పూర్తయ్యాక అమెరికా విడిచి వెళ్లాల్సిందేనన్నారు.
“తాత్కాలికంగా అమెరికాలో ఉన్న వ్యక్తి గ్రీన్‌కార్డు కావాలంటే ఇకపై తన స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేయాలి. అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ విధానం వల్ల వలస వ్యవస్థ చట్టబద్ధంగా పనిచేస్తుంది. లోపాలను ఉపయోగించుకునే పరిస్థితులు తగ్గుతాయి” అని ఆయన చెప్పారు.
గ్రీన్‌కార్డు తిరస్కరణ తర్వాత అక్రమంగా అమెరికాలోనే మిగిలిపోయే వారిని గుర్తించి బయటకు పంపాల్సిన అవసరం కూడా ఈ నిర్ణయంతో తగ్గుతుందని కాలర్ తెలిపారు.
యూఎస్‌సీఐఎస్‌పై భారం తగ్గి, ఇతర ముఖ్య అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. హింసాత్మక నేరాలు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసా దరఖాస్తులు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం కేటాయించగలమన్నారు.
అమెరికా కాన్సులేట్ల ద్వారానే ఎక్కువ కేసులు నిర్వహించడం వల్ల సంస్థ పరిమిత వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు.

