వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాబోయే వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. 2027 నాటికి శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2025-26 సంవత్సరానికి గాను 68 లక్షల మొక్కల లక్ష్యంలో 90 శాతం నాటినట్లు తెలిపారు. 2026-27 లక్ష్యాలను సాధించేందుకు డీఆర్డీవో, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, ఎక్సైజ్ శాఖలు, పురపాలక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.స్కూళ్లు, అంగన్వాడీలు, పోలీస్ స్టేషన్లు, రైతు వేదికలు, సంక్షేమ హాస్టళ్లలో నిమ్మ, మునగ, కరివేప, చింత, బత్తాయి, జామ వంటి మొక్కలు నాటాలని, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలను నాటాలని తెలిపారు.ప్రతి శాఖ సమన్వయంతో మొక్కల పెంపకం, పంపిణీ కార్యక్రమాలను విస్తరించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

