ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండో రోజు మరింత ఉధృతమైంది. మూడు నెలల వేతన బకాయిలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల కోసం పారిశుధ్య కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టి, వ్రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ హాజరు కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. రాత్రి సమయంలో కూడా మహిళా కార్మికులు ధర్నా శిబిరంలోనే ఉండి నిరసన కొనసాగించారు.వేతనాలు అందక ఇళ్ల అద్దెలు, కరెంటు బిల్లులు, రుణాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా కాంట్రాక్టర్ వివరాలు కూడా తెలియని పరిస్థితి ఉందని తెలిపారు.కార్మికుల ఆందోళనకు CPI(M) నేతలు, CITU ప్రతినిధులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
