పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గడ్డ ప్రాంతంలో కలకలం రేగింది. గాయాలతో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఒక యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన గంట వ్యవధిలోనే పోలీసులు దర్యాప్తును ముగించి నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం.

మృతుడిని గుంటూరుకు చెందిన కళ్యాణ్ చక్రవర్తి (22) గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలో పలు ఆస్తి సంబంధిత నేరారోపణలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పెందుర్తి పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో వేగంగా స్పందించారు. మృతదేహం లభించిన కొద్ది సేపటికే ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించడంలో పెందుర్తి పోలీసులు చూపిన వృత్తి నైపుణ్యం, చురుకుదనంపై ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని, హత్యకు గల పూర్తి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని పెందుర్తి పోలీసులు తెలిపారు.
