రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘విశాఖ ఉత్సవాల’కు నగరం ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా VMRDA సెంట్రల్ పార్క్‌లో నిర్వహించనున్న ఫ్లవర్ షో ఏర్పాట్లను VMRDA చైర్మన్ శ్రీ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంగళూరు, కోల్‌కతా నుంచి తెప్పించిన అరుదైన పుష్పాలతో ఈ షోను తీర్చిదిద్దుతున్నారు. థీమ్ ఆధారిత పుష్ప అలంకరణలు సందర్శకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ఈ ఏడాది ఫ్లవర్ షోను “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరిత అభివృద్ధి అనే సందేశం ప్రజల్లోకి వెళ్లేలా ప్రదర్శనను రూపొందిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు భారీగా జనసందోహం వచ్చే అవకాశం ఉన్నందున.. తాగునీరు, పార్కింగ్, భద్రత మరియు ఫైర్ సేఫ్టీ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జాయింట్ కమిషనర్ కె. రమేష్, చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ నగరానికి వన్నె తెచ్చేలా, పర్యాటకులకు మధుర అనుభూతిని మిగిల్చేలా ఈ ఫ్లవర్ షో ఉంటుందని ప్రణవ్ గోపాల్ ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ ఉత్సవాల్లో ‘ఫ్లవర్ షో’ హైలైట్: VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్!
