దేశమంతా భక్తిశ్రద్ధలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, అన్నమయ్య జిల్లాలో మాత్రం మద్యం వ్యాపారులు బరితెగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘డ్రై డే’ (Dry Day) పాటించాల్సిన రోజే రహస్య కౌంటర్లు తెరిచి యధేచ్ఛగా అమ్మకాలు సాగించారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట పట్టణంలో వైన్ షాపు యజమానులు వినూత్న రీతిలో అక్రమాలకు తెరలేపారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే గోనె సంచుల్లో మద్యం బాటిళ్లను బయటకు తరలించి, షాపు ముందే రహస్యంగా విక్రయాలు జరిపారు. అధికారులు వేడుకల్లో నిమగ్నమైన తరుణాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ‘డోర్ డెలివరీ’ తరహాలో విక్రయాలు సాగించడం గమనార్హం. CM చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి బాటిల్ పైన బార్ కోడింగ్ ఉంది. దీని ద్వారా ఏ షాపు నుంచి ఈ మద్యం బయటకు వచ్చింది, నిందితులు ఎవరు అనేది ఇట్టే కనిపెట్టవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన వీరిపై ఎక్సైజ్ శాఖ అధికారులు బార్ కోడ్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
