మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు సమగ్ర చర్యలు అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళల ట్రాఫికింగ్ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని, బాధితులకు రక్షణ కల్పించడం అత్యంత ముఖ్యమని అన్నారు. అధికారులకు కేసుల విచారణ, బాధితులతో వ్యవహరించే విధానం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, టెక్నాలజీ వినియోగంతో నిందితులను త్వరగా గుర్తించే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. శక్తి యాప్ వంటి డిజిటల్ సాధనాలు కేసుల విచారణ వేగవంతం చేయడంలో సహాయపడుతున్నాయని చెప్పారు.ఉద్యోగాల పేరుతో, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విభాగాల మధ్య సమన్వయం పెంపొందించడం ద్వారా నిందితులకు శిక్షలు ఖరారు చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, మహిళా అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.
