గువాహటి: అసోంలోని కాజిరంగా జాతీయ పార్కు, పులుల అభయారణ్యంలో కొత్త జాతికి చెందిన మార్టెన్‌ను గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. పసుపు గొంతు మార్టెన్ (Yellow-throated Marten) కనిపించడం అసోం పరిరక్షణ విధానాల విజయాన్ని మరోసారి చాటిందని ముఖ్యమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది.
రక్షిత ఆవాసాలను సమర్థంగా కాపాడుతున్నందువల్ల కాజిరంగా వంటి ప్రాంతాలు విశేష జీవ వైవిధ్యాన్ని, వన్యప్రాణుల మనుగడను కొనసాగిస్తున్నాయని తెలిపింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అసోం ప్రభుత్వం కేవలం అటవీ ప్రాంతాల సంరక్షణకే పరిమితం కాకుండా, సంపూర్ణ జీవవ్యవస్థలను అభివృద్ధి చేసే దిశగా పని చేస్తోందని పేర్కొంది.
ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కుగా ఉన్న కాజిరంగా, ఒక కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. దేశీయ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
2025-26లో ఈ పార్కును సందర్శించిన పర్యాటకుల సంఖ్య 15 శాతానికి పైగా పెరిగి 4.68 లక్షలకు చేరింది. విదేశీ పర్యాటకుల రాక ఒకే ఏడాదిలో 17,693 నుంచి 30,474కు పెరిగింది.
యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న కాజిరంగా జాతీయ పార్కును 1974లో జాతీయ పార్కుగా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడ నివసిస్తున్నాయి. పులులు, ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అనేక క్షీరదాలతో పాటు వేలాది పక్షులకు కూడా ఇది నిలయంగా ఉంది.
అసోంలోని గోలాఘాట్, నగావ్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు ఉత్తరాన బ్రహ్మపుత్ర నది, దక్షిణాన కార్బి ఆంగ్లాంగ్ పర్వత శ్రేణుల మధ్య ఉంది.

