చెన్నై, మే 19: తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాంటీన్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు.
2011-16 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం సందర్భంగా 2013 ఫిబ్రవరి 24న చెన్నైలో తొలిసారి వీటిని ప్రారంభించారు. తక్కువ ధరలకు భోజనం అందించడం వల్ల ప్రజల్లో ఇవి త్వరగా ఆదరణ పొందాయి. తర్వాత రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాలకు విస్తరించారు.
2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో మరో 200 క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. అలాగే ‘అమ్మ క్యాంటీన్’ పేరును కూడా మార్చలేదు. ఇప్పుడు సీఎం విజయ్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహారం రుచి, నాణ్యత ఆశించిన స్థాయిలో లేదన్న ఫిర్యాదులు రావడంతో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
క్యాంటీన్లలో సదుపాయాలు పెంచాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని, వంట సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మరో 237 క్యాంటీన్లు కొనసాగుతున్నాయి.

