రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని APSDMA కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్–2026’ను ఆవిష్కరించారు.

వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ పనులను తగ్గించాలని, కార్మికులు, వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు సిద్ధంగా ఉంచాలని వైద్యశాఖకు సూచించారు. అలాగే పశువులకు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు వడగాల్పులపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
