విజయ్ రూపానీ కుమార్తె లేఖకు ఎయిర్ ఇండియా సమాధానం

June 10, 2026 3:22 PM

ఎయిర్ ఇండియా పరిహారంపై వివాదం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం జరిగి ఏడాది పూర్తికానున్న వేళ పరిహారం చెల్లింపులపై కొత్త చర్చ మొదలైంది. ప్రమాదంలో మరణించిన మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుమార్తె రాధికా రూపానీ రాసిన లేఖకు ఎయిర్ ఇండియా స్పందించింది. పరిహారం స్వీకరించేందుకు బాధిత కుటుంబాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేసింది.

“పరిహారం తీసుకోవాలని గడువు పెట్టలేదు”

రాధికా రూపానీ ఇటీవల టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు నివేదిక రాకముందే కుటుంబాలు భవిష్యత్ హక్కులను వదులుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

“మాకు కేవలం పరిహారం కాదు. ప్రమాదంపై స్పష్టమైన సమాధానాలు కావాలి. పారదర్శకత కావాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు మాకు ఉంది” అని ఆమె పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా, తుది పరిహారం ప్రతిపాదనలో ఎలాంటి గడువు పెట్టలేదని తెలిపింది.

“దర్యాప్తు నివేదిక వెలువడే వరకు వేచి చూడాలనుకునే కుటుంబాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కొన్ని కుటుంబాలు ఇప్పటికే ఆ మార్గాన్నే ఎంచుకున్నాయి” అని సంస్థ తన లేఖలో వెల్లడించింది.

Also Read

తక్షణ సాయం, తుది పరిహారం వేర్వేరు

ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా మధ్యంతర పరిహారం చెల్లించడం ప్రారంభించామని ఎయిర్ ఇండియా తెలిపింది.

“తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చడానికే మధ్యంతర చెల్లింపులు చేశాం. తుది పరిహారం నిర్ణయించే ప్రక్రియ దీనికి భిన్నం” అని సంస్థ పేర్కొంది.

తక్షణ సాయం తీసుకోవాలా, దర్యాప్తు నివేదిక కోసం వేచి చూడాలా అనే విషయంలో కుటుంబాలు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

రూ. కోటి సాయం చేసిన ట్రస్ట్

ప్రమాదం తర్వాత టాటా గ్రూప్ AI-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన దాదాపు అన్ని కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించింది.

అదనంగా ఎయిర్ ఇండియా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించింది. ఇప్పటివరకు 96 శాతం కుటుంబాలకు ఈ మొత్తం అందినట్లు సంస్థ తెలిపింది.

మిగిలిన కేసుల్లో అవసరమైన పత్రాలు పూర్తి కాకపోవడం లేదా కుటుంబ వివాదాలు ఉండటం వల్ల చెల్లింపులు నిలిచిపోయాయని వివరించింది.

260 మంది ప్రాణాలు బలిగొన్న ప్రమాదం

2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్సేపటికే కుప్పకూలింది.

ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 260 మంది మరణించారు. ఇది భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు

ఈ ప్రమాదంపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) విచారణ కొనసాగిస్తోంది.

కొన్ని నివేదికల ప్రకారం తుది దర్యాప్తు నివేదిక ముసాయిదాను ఇంకా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA)లకు పంపలేదు.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి ప్రక్రియ. విమానం అమెరికాలో తయారవడం, బ్రిటన్ దర్యాప్తులో భాగస్వామి కావడం వల్ల ఈ సంస్థల అభిప్రాయాలు అవసరం.

తుది నివేదిక ఆలస్యమవుతున్న నేపథ్యంలో జూన్ 12న రెండో ప్రాథమిక నివేదిక విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

పరిహారం ప్రక్రియ ఎందుకు ఆపలేకపోయారు?

తుది దర్యాప్తు నివేదిక ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకపోవడంతో పరిహారం ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాలేదని వర్గాలు తెలిపాయి.

ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా నివేదిక కోసం నిరవధికంగా వేచి చూడమని చెప్పలేమని పేర్కొన్నాయి.

బాధితుల వస్తువుల అప్పగింత

ప్రమాద స్థలంలో లభ్యమైన 22 వేలకుపైగా వ్యక్తిగత వస్తువులను ఎయిర్ ఇండియా జాగ్రత్తగా భద్రపరిచింది.

187 మంది మృతులకు చెందిన వస్తువులు గుర్తించగా, వారిలో 139 మంది కుటుంబాలకు భారత్, బ్రిటన్‌లలో వాటిని అప్పగించింది.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి 25 డిజిటల్ పరికరాలు లభించాయి. వాటిలో 16 పరికరాలను ఇప్పటికే కుటుంబాలకు అందజేశారు.

కుటుంబాలతో టాటా సంస్థల భేటీలు

ప్రమాదం తర్వాత టాటా గ్రూప్ సంస్థల సీఈవోలు భారత్, బ్రిటన్‌లలోని 165 బాధిత కుటుంబాల్లో 152 కుటుంబాలను వ్యక్తిగతంగా కలిశారు.

వారి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని సంస్థ వెల్లడించింది.

Also Read


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media