పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. ముజఫరాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ మరణించినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారని పాక్ సైన్యం స్పష్టం చేసింది. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.
ఈ ప్రమాదంలో సుమారు 21 మంది భద్రతా సిబ్బంది మరణించారని, నీలం లోయ సెక్టార్కు అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా తెలిపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కూలిపోయిందని, ప్రమాద స్థలంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని నివేదికలు వచ్చాయి. ఈ ఘటనపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

