భారత మామిడి పండ్ల దిగుమతులపై ఎటువంటి నిషేధం విధించలేదని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పురుగుమందుల అవశేషాలు ఉన్నాయన్న నెపంతో దిగుమతులను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, నూతనంగా అమల్లోకి వచ్చిన ఫైటోశానిటరీ నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులు సజావుగా సాగుతున్నాయని నేపాల్ అధికారులు తెలిపారు. నేపాల్‌కు చెందిన ప్లాంట్ క్వారంటైన్ అండ్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ సెంటర్ తో పాటు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఎటువంటి నిషేధం లేదంటూ తేల్చి చెప్పాయి. భారత ప్రభుత్వం జారీ చేసే సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన పక్షంలో దిగుమతులకు వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 2,005 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను నేపాల్‌కు ఎగుమతి చేశారు. కేవలం జూన్ నెలలోనే 18 కన్‌సైన్‌మెంట్ల ద్వారా 266 మెట్రిక్ టన్నుల మామిడి ఆ దేశానికి చేరుకుంది.

