వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న ఆయన, అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను, క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చారు. బాధితుల పరామర్శ తర్వాత సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

