బాసర ట్రిపుల్‌ ఐటీలో అల్పాహారంలో బొద్దింక

June 15, 2026 11:39 AM
RGUKT Basara students protesting over cockroach found in breakfast served at university mess.

విద్యార్థుల ఆగ్రహం

పాత మెస్ నిర్వాహకులకే మళ్లీ బాధ్యతలపై విమర్శలు

బాసర: బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో భోజనశాలల నిర్వహణపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఉదయం ఈ1, ఈ2 విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో బొద్దింక కనిపించడం క్యాంపస్‌లో కలకలం రేపింది. చపాతీ, ఆలూ కుర్మా వడ్డించిన సమయంలో ఈ ఘటన బయటపడటంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్పాహారంలో బొద్దింకను గుర్తించిన విద్యార్థులు వెంటనే మెస్ సిబ్బందిని, నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలుమార్లు ఆహార నాణ్యతపై ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత సమస్యలే మళ్లీ ముందుకు

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆహార నాణ్యతపై ఆరోపణలు కొత్తవి కావు. 2022, 2023 సంవత్సరాల్లో ఆహారం వికటించి సుమారు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అయితే సంబంధిత అధికారుల చర్యలు నామమాత్రంగానే మిగిలిపోయాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఆ ఘటనల తర్వాత కూడా భోజనంలో కప్పలు, బల్లులు, బొద్దింకలు కనిపించిన సందర్భాలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సమస్యలు పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

టెండర్లపై విద్యార్థుల అభ్యంతరాలు

భోజనశాలల కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత కొత్త టెండర్లు పిలిచిన సమయంలో పాత నిర్వాహకులకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇన్‌ఛార్జి ఉపకులపతికి వినతిపత్రాలు కూడా అందజేశారు.

నిరసనలు, ఆందోళనలు చేపట్టినా అధికారుల నిర్ణయంలో మార్పు రాలేదని విద్యార్థులు అంటున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులకే తిరిగి బాధ్యతలు అప్పగించడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.

తనిఖీలు కాగితాలకే పరిమితమా?

ప్రతిరోజూ ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తే అల్పాహారంలో బొద్దింక ఎలా వచ్చిందని నిలదీస్తున్నారు.

ఆహారంలో పురుగులు వస్తే విద్యార్థులు ఎలా భోజనం చేయాలని మెస్ నిర్వాహకుడిని ప్రశ్నించగా, ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విద్యార్థులు తెలిపారు.

కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు

క్యాంపస్‌లో సమస్య తలెత్తిన ప్రతిసారీ కమిటీల పేరుతో కాలయాపన చేయడం అధికారులకు అలవాటైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విచారణలు ప్రకటించడం తప్ప ఇప్పటివరకు బాధ్యులపై గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అంటున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజీ పడే పరిస్థితి లేదని, భోజనశాలల నిర్వహణలో పూర్తిస్థాయి మార్పులు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విచారణకు కమిటీ

ఈ ఘటనపై ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ స్పందించారు. అల్పాహారంలో బొద్దింక వచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.

Also Read


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media