గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత అక్టోబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి గాజా స్ట్రిప్‌లో 1,005 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ గాజాలో దాదాపు ప్రతిరోజూ వైమానిక దాడులు, షెల్లింగ్, సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా మధ్య గాజా ప్రాంతంలోని పట్టణాలు, శరణార్థి శిబిరాలు, గాజా సిటీలో జరిగిన డ్రోన్ దాడుల్లో తాజా మరణాలు నమోదయ్యాయి.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో బుధవారం జరిగిన మరో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారని నాసర్ ఆసుపత్రి వైద్య అధికారులు తెలిపారు.
ఈ దాడిని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. లక్ష్యంగా ఓ “ఉగ్రవాది” ఉన్నాడని పేర్కొంది. అయితే మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
మువాసి తీర ప్రాంతంలోని తాత్కాలిక శిబిరం సమీపంలో ఉన్న వ్యక్తుల గుంపుపై దాడి జరిగినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో లక్షలాది మంది నిరాశ్రయ పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.
గాజాలో హమాస్, దాని అనుబంధ మిలిటెంట్ గ్రూపులపై చర్యలు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలో తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని కూడా విస్తరించినట్లు పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఇజ్రాయెల్, హమాస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇక గత వారాంతంలో జరిగిన దాడుల్లో హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన ఇద్దరు మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం మరో ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో గాజాలో మొత్తం మరణాల సంఖ్య 73 వేల మార్క్ దాటినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే మరణించిన వారిలో పౌరులు, మిలిటెంట్ల వివరాలను వేర్వేరుగా ప్రకటించలేదు.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి సుమారు 1,200 మందిని హతమార్చారు. 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
దీనికి ప్రతిస్పందనగా హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి బందీలను విడిపిస్తామని ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యలు ప్రారంభించింది.
ALSO READ



