భారతీయ నావికులతో వెళ్తున్న ‘లుటుఫ్’ నౌక హైజాక్.. సోమాలియా తీరంలో కలకలం

August 21, 2026 4:34 PM
Hijacked cargo ship carrying Indian sailors near Somalia coast

ఆరుగురు భారతీయ నావికులు సహా 10 మంది సిబ్బంది

సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆరుగురు భారతీయ నావికులతో వెళ్తున్న ‘లుటుఫ్’ అనే కార్గో నౌకను పైరేట్స్ హైజాక్ చేసినట్లు సమాచారం.

ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ఈ నౌక ప్రయాణిస్తోంది.

టర్కీలోని సైనిక శిక్షణా కేంద్రానికి తరలించేందుకు నౌకలో ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

హైజాక్‌కు గురైన నౌకలో ఆరుగురు భారతీయ సముద్ర నావికులతో పాటు ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు, ఇద్దరు సెర్బియా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

గత ఏప్రిల్ 26న ఒక వ్యాపార నౌకను హైజాక్ చేసిన పైరేట్స్ బృందమే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై భారత ప్రభుత్వం, టర్కీ అధికార వర్గాలు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

నౌక వద్దకు టర్కీ నౌకలు.. హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా

‘లుటుఫ్’ నౌక హైజాక్ విషయం తెలియగానే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

టర్కీకి చెందిన రెండు నౌకలు హైజాక్ అయిన నౌక దగ్గరకు చేరుకున్నాయి.

టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాయి.

ఈ సమయంలో ఓ చిన్న పడవలో ఇద్దరు వ్యక్తులు వచ్చి నౌకలో ఉన్న వారికి సోమాలియాలో ఎక్కువగా ఉపయోగించే ‘ఖత్’ అనే పదార్థాన్ని అందించినట్లు తెలిసింది.

దాన్ని తీసుకున్నవారు నిద్ర లేకుండా చురుగ్గా ఉంటారని సమాచారం.

ఆ పడవ తిరిగి తీరానికి చేరుకున్న కొద్దిసేపటికే వైమానిక దాడి జరిగింది.

ఈ దాడిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే దాడికి పాల్పడింది ఎవరు? మరణించిన వారు హైజాక్‌లో పాల్గొన్న పైరేట్లేనా? అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు.

‘లుటుఫ్’ నౌక పరిస్థితి, అందులోని భారతీయ నావికులతో పాటు ఇతర సిబ్బంది భద్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సోమాలియాలో మిలీషియా హింస.. కాల్పుల్లో నలుగురు మృతి

సోమాలియాలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

బైడోవా నగరంలో సోమాలియా ప్రభుత్వ దళాలు, ఆయుధాలు చేపట్టిన మిలీషియా తిరుగుబాటుదారుల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

సోమవారం తెల్లవారుజామున తిరుగుబాటుదారులు బైడోవా నగరంపై దాడికి దిగారు.

ఊహించని దాడితో నగరం ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 30 మంది మిలీషియా తిరుగుబాటుదారులు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అయితే ప్రభుత్వ దళాలకు జరిగిన ప్రాణనష్టంపై స్పష్టమైన వివరాలు ఇంకా బయటకు రాలేదు.

శరణార్థుల శిబిరాల్లో భయాందోళనలు

పోరాటాలు, తీవ్ర కరువు కారణంగా ఇప్పటికే ఇళ్లను వదిలివచ్చిన దాదాపు ఐదు లక్షల మందికి పైగా శరణార్థులకు బైడోవా నగరం ఆశ్రయంగా ఉంది.

ఇప్పుడు వారు ఉంటున్న ప్రాంతంలోనే బాంబులు, కాల్పుల శబ్దాలు వినిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు.

అకస్మాత్తుగా గాయపడినవారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు చేరుతుండటంతో బైడోవాలోని వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఎప్పుడు ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో శరణార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media