ఉద్యోగం పోయిందని పాత కంపెనీ క్లయింట్ల కార్డులతో మోసం
386 ట్రాన్సాక్షన్స్.. 70కి పైగా విమాన టికెట్ల బుకింగ్
హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన కంపెనీ క్లయింట్ల క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేశాడు.
ఆ కార్డులతో ఏకంగా 386 మోసపూరిత లావాదేవీలు చేసి రూ.1.64 కోట్ల నష్టం కలిగించాడు.
ఉద్యోగం పోయిన కొద్దిరోజులకే ట్రావెల్ ఏజెన్సీ
మధ్యప్రదేశ్‌కు చెందిన రిషబ్ జగ్గీ 2025 జనవరిలో అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టికెటింగ్ ఏజెంట్‌గా ఉద్యోగంలో చేరాడు.
అయితే అతని పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో యాజమాన్యం గత మార్చిలో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.
ఆ తర్వాత కొద్దిరోజులకే రిషబ్ సొంతంగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించాడు.
9 క్రెడిట్ కార్డుల వివరాలు అక్రమంగా సేకరణ
ఈ క్రమంలో కంపెనీ భాగస్వామ్య సంస్థకు చెందిన వ్యక్తుల వద్ద ఉన్న 9 క్రెడిట్ కార్డుల వివరాలను రిషబ్ జగ్గీ అక్రమంగా సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కార్డులను ఉపయోగించి వరుసగా మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డాడు.
మొత్తం 386 లావాదేవీలు చేశాడు. అదే క్రెడిట్ కార్డులతో 70కి పైగా విమాన టికెట్లను కూడా బుక్ చేశాడు.
రూ.1.64 కోట్ల లావాదేవీలు
ఈ వ్యవహారంలో మొత్తం రూ.1.64 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో కంపెనీతో పాటు క్లయింట్లకు భారీ నష్టం వాటిల్లింది.
బాధితుల నుంచి ఫిర్యాదు అందడంతో కంపెనీ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి అప్రమత్తమయ్యారు. వెంటనే సైబర్ క్రైమ్, CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



